AP CM Chandrababu Naidu On Tirupati Stampede Incident : ఏపీలోని తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ, అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని అధికారులను నిలదీశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డీజీపీ, టీటీడీ ఈవో, తిరుపతి కలెక్టర్, ఎస్పీలతో బుధవారం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు జాగ్రత్త చర్యల్లో విఫలం అయిన అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునః సమీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న టైంలోనే ఇలాంటి విచారకర ఘటన జరగడం తీవ్రంగా బాధించిందని అన్నారు.
చంద్రబాబు తిరుపతి పర్యటన :క్షతగాత్రుల్ని పరామర్శించేందుకు నేడు చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నత అధికారులు, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.