Devansh World Record In Chess :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డును నెలకొల్పారు. 9 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్- 175 పజిల్స్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందుకున్నారు. దేవాంశ్ సాధించిన ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
దేవాంశ్ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి :దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో ట్రైనింగ్ పొందడం ప్రత్యక్షంగా చూశానని, ఈ ఘనత పట్ల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 'దేవాంశ్ ఈ క్రీడను(చదరంగం) ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలో భారత చదరంగ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటలు పాటు శిక్షణ పొందాడు. చెస్ పాఠాలను నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా' అని లోకేశ్ తెలిపారు. దేవాంశ్ సృజనాత్మకంగా చెస్‌ను నేర్చుకునే ఒక డైనమిక్ స్టూడెంట్ అని కోచ్ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన ఫజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమని ప్రశంసించారు. దేవాంశ్ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని ఆయన వెల్లడించారు.