AP CM Chandrababu Speech in Assembly :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల విధ్వంసం ఫలితంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొందని, రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవసరాలను గుర్తించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించారని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు ప్రకటించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని, రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. అమరావతికి కేంద్రం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయంపై బడ్జెట్‌లో పెట్టారని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.
జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనం : పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు నాంది పలికాయని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి ప్రారంభించామని చెప్తూ ఆనాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చామని, ఇవాళ మనవాళ్లు ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కనిపించే పరిస్థితి ఉందన్నారు.
వికసిత్ భారత్ 2047వరకు ప్రపంచంలోనే భారత్ మొదటి లేదా రెండో స్థానానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయన్న చంద్రబాబు 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం కూటమికి ఓట్లు పడ్డాయని వివరించారు. తన రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి ఫలితాలు చూడలేదన్న చంద్రబాబు ఈ స్థాయి విజయానికి చాలా కృషి ఉందని చెప్పారు.
CM Chandrababu Comments on Party Alliance : గత ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని, జైలుకు వచ్చి పవన్‌కల్యాణ్ పరామర్శించారని గుర్తు చేశారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ ముందుకొచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని మొదటగా పవన్ చెప్పారని, ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చిందని వివరించారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసేవరకు సమష్టిగా ముందుకెళ్తామని చెప్పారు.