Visakhapatnam and Vijayawada Metro Rail Projects :ఏపీలో గత జగన్ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిన విశాఖపట్నం, విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. రెండు మెట్రోలకు తొలిదశలో చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే సిద్ధం చేసి కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. సవరించిన డీపీఆర్‌ల ప్రకారం రెండు దశలకు కలిపి విజయవాడ-అమరావతి మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.25,130 కోట్లు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ.17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
రెండు దశల్లో విజయవాడ-అమరావతి మెట్రో :విజయవాడ-అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. దీని మొత్తం పొడవు 66.20 కిలో మీటర్లు ఉండనుంది. తొలి దశలో 38.40 కి.మీ కాగా దీని నిర్మాణ వ్యయం రూ.11,009 కోట్లు. తొలిదశను విజయవాడలోని పండిట్‌నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25.95 కి.మీ, అదే విధంగా బస్‌స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ నిర్మించనున్నారు. రెండో దశలో 27.80 కిలోమీటర్లను రూ.14,121 కోట్లతో నిర్మించనున్నారు. దీనిని పండిట్‌నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రాజధాని అమరావతి వరకూ నిర్మించాలని ప్రతిపాదించారు.
నాలుగు కారిడార్లుగా విశాఖ మెట్రో :విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టును రెండుదశల్లో నాలుగు కారిడార్లుగా చేపట్టాలన్నది ప్రతిపాదించారు. నాలుగు కారిడార్లు కలిపి 76.90 కిలోమీటర్ల మేర మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మిస్తారు. మొత్తం 54 స్టేషన్లు ఉంటాయి. తొలిదశలో చేపట్టే మూడు కారిడార్ల మొత్తం పొడవు 46.23 కి.మీ ఉండనుంది. మూడు కారిడార్ల నిర్మాణవ్యయం 11,498 కోట్ల రూపాయలు.
ఇందులో కారిడార్ 1ను విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.40 కి.మీ పొడవుతో 29 స్టేషన్లు ఉండనున్నాయి. ఇక కారిడార్ 2ను గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ 5.07 కి.మీ పొడవుతో 6 స్టేషన్లతో, కారిడార్ 3ని తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కి.మీ పొడవుతో 7 స్టేషన్లతో నిర్మించాలని ప్రతిపాదించారు.