AP CID Chief on leave : ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో కొందరు సివిల్ సర్వీస్ అధికారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు వారికి సంకటంగా మారింది. ప్రజాస్వామ్యం వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థలు ప్రధానమైనవి. మూడు కలిసి పనిచేసినట్లు కనిపిస్తాయి. కానీ రాజ్యాంగ పరంగా ఆయా వ్యవస్థ బాధ్యతలు, విధులు క్లియర్‌కట్‌గా విభజన ఉంది. శాసన వ్యవస్థ చేసే ప్రతి చట్టాన్ని, ఆదేశాన్ని గుడ్డిగా కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలని లేదు. అందులోని తప్పుఒప్పొలను శాసన వ్యవస్థలో ఉండే నేతలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థపై ఉంది. ఈ బాధ్యతను విస్మరించి జగన్ చెప్పినట్లు నడుచుకున్న పాపానికి ఆయన అధికారం పోయిన తెల్లారే సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితిని ఏపీ సీఐడీ ఛీఫ్ కొనితెచ్చుకున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ ముఖ్యనేతలు, ఇతరులపై తోచినట్లు తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేసిన అత్యంత వివాదాస్పద అధికారి సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై వెళ్లనున్నారు. తప్పుడు కేసుల నమోదులో కీలకంగా వ్యవహరించిన ఆయన బుధవారం నుంచి నెల రోజుల పాటు సెలవు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కు అర్జీ పెట్టుకున్నారు. అచ్చం సంజయ్‌లానే వ్యవహరించిన సీఎస్ ఆయనకు నెల రోజులు సెలువు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పేరుకు వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటన వెళ్లేందుకంటూ ఆయన దరఖాసుకున్నా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడం రేపో మాపో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న తరుణంలో విదేశాలకు వెళ్తుండడం విశేషం.