AP Cabinet Meeting Decisions :నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే కేబినెట్ లోగా దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇంఛార్జి మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అక్రమంగా నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించిన వాటిపై పూర్తిస్థాయి విచారణ కోసం మంత్రుల కమిటీ కూడా వేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామవార్డు సచివాలయాల రేషనలైజేషన్ చేయాలని తీర్మానించింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా నిషేధిత జాబితా నుంచి భూములకు అక్రమంగా తొలగించడంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను సీఎం నివేదిక కోరారు. భూ అక్రమాలపైనా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా విచారణ చేయించాలని కేబినెట్ భేటీలో తీర్మానించారు. ప్రత్యేకించి సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 13.6 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే ఇందులో నుంచి 7 లక్షల ఎకరాలకు పైగా భూముల్ని జాబితా నుంచి తప్పించినట్లు ప్రాథమికంగా నిర్థరించారు. వీటిలో 25 వేల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించారు.
అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు 2025 డిసెంబర్ 31 వరకూ పొడిగించేందుకు కేబినెట్ తీర్మానం చేసింది. అందరికీ ఇళ్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు గానూ మార్గదర్శకాల జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో 2019 అక్టోబర్ 15 వరకూ నిర్మించుకున్నఇళ్ల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు.
నిషేధిత భూములపై మంత్రివర్గ ఉపసంఘం - కేబినెట్ నిర్ణయాలివే