TTD Slot Darshanam : కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి దాదాపు మూడు నెలల ముందుగానే (60రోజులకు పైగా) టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితిపై భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. అందులో భాగంగానే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడంతోపాటు రూ.10,500 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ దర్శనం, సర్వదర్శనం అని పలు రకాలుగా విభజించింది. స్వామివారిని దర్శించుకుంటున్నవారిలో అత్యధికులు సామాన్యులే కాగా, రద్దీ వేళల్లో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే దాదాపు 30 గంటలు స్వామి వారి దర్శనం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది.
ఇలా కాకుండా భక్తులకు నిర్దేశిత సమయం కేటాయించి దర్శన అవకాశం కల్పిస్తే రద్దీని నియంత్రించే వీలుంది. పైగా రెండు, మూడు గంటల్లోనే స్వామి వారి దర్శనం పూర్తయ్యే అవకాశాలున్నాయి. అందుకే స్లాట్ దర్శనం విధానం రూపొందించారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంలో ఆధార్ కార్డు ద్వారా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శన సమయం కేటాయిస్తారు. ఇదిలా ఉండగా కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడుతుంటారు. ఇది భక్తుల సెంటిమెంట్.
20 ఏళ్ల కిందట కంకణాలు
అలిపిరి, శ్రీవారి మెట్టు నుంచి నడక మార్గంలో ఏడుకొండలపైకి చేరుకుని స్వామి వారిని దర్శించుకోవడాన్ని దివ్యదర్శనంగా భావిస్తుంటారు. వారికి కాలినడక మార్గంలోనే టికెట్లు కేటాయించి 2, 3 గంటల్లోనే దర్శనం కల్పించేవారు. దాదాపు 20 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో టీటీడీ ఈవోగా పనిచేసిన ఐవీ సుబ్బారావు ఈ విధానానికి రూపకల్పన చేసి భక్తుల మన్నన పొందారు. కాలి నడక మార్గంలో తిరుమల వచ్చే భక్తులకు మార్గమధ్యంలో చేయికి రిస్ట్‌బాండ్ తరహాలో వాటర్‌ప్రూఫ్ కంకణాన్ని ఇచ్చేవారు. ఈ విధానంలో భక్తులు తమకు కేటాయించిన సమయానికి వెళ్లి రెండు, మూడు గంటల్లో దర్శనం ముగించుకునేవారు. తాజాగా ఇదే పద్ధతిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రస్తావించిన నేపథ్యంలో ట్యాగ్ విధానాన్ని తిరిగి అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో అంటే 1990 దశకం వరకూ సామాన్యభక్తుడు కూడా మూలవిరాట్‌ని అత్యంత సమీపంగా (కులశేఖరపడి వరకు వెళ్లి) దర్శించుకునే వీలుండేది. ప్రస్తుతం ఈ అవకాశాన్ని ప్రస్తుతం వీఐపీలు, రూ.10,500 టిక్కెట్లు (శ్రీవాణి) తీసుకునే భక్తులకు మాత్రమే కల్పిస్తున్నారు. ఆ తర్వాత గరుడాళ్వార్ సన్నిధి నుంచి జయవిజయులను దాటి స్నపన మండపం వరకు వెళ్లి దర్శించుకునే (లఘుదర్శనం) అవకాశం కల్పించారు. కొన్నేళ్లకే లఘు దర్శనం కూడా రద్దు చేసి గరుడాళ్వార్ సన్నిధి నుంచి (మహాలఘు దర్శనం) అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇలా కాకుండా కనీసం స్నపన మండపం నుంచి స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెల కోటా టికెట్లు
జనవరి 21న ఆర్జిత సేవా టికెట్లు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తారు.
జనవరి 21న వర్చువల్ సేవల కోటా, జనవరి 23న అంగప్రదక్షిణం టోకెన్లు, 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక స్పెషల్ దర్శనం కోటా టిక్కెట్లు జనవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్ని దారులో - ఇవి తెలిస్తే దర్శనం సులభమే
దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!