RESEARCH ON DOGS : రాత్రిళ్లు కుక్కలు మొరగడం తెలిసిందే. ఏదైనా వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కదలికలు ఉన్నా కుక్కలు అదే పనిగా మొరుగుతుంటాయి. కుక్కలు మొరిగితే ఎవరూ పట్టించుకోరు. కానీ, కొన్ని సందర్భాల్లో అవి నక్కల మాదిరిగా ఊలలు వేస్తుంటాయి. కుక్కలు ఊలలు వేస్తున్నాయంటే ఏదో అశుభం జరుగుతుందని ప్రజలు భావిస్తుంటారు. వాటిని పెంచుకునే యజమాని ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశాలున్నాయని, యముడు వస్తున్నాడని, ఎవరైనా చనిపోతారని భయపడుతుంటారు. ఈ నేపథ్యంలో కుక్కలు ఊలలు వేయడం వెనుక కారణాలేమిటి అనే అంశంపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి.
కుక్కలు మన చుట్టూ ఉన్న ఆత్మలను చూడగలవని పూర్వీకులు చెప్తుంటారు. అవి కనిపించినపుడు ఊలలు వేస్తుంటాయని అంటుంటారు. కుక్కలు నిజంగా ఆత్మలను చూడగలవా? వాటికి భయపడి అరుస్తాయా? అనేది ఇప్పటికీ రుజువు కాని విషయమే.
ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? - రూ.10 లక్షల రాయితీకి దరఖాస్తు చేసుకోండి
మనుషుల కంటే కుక్కల్లో వినికిడి శక్తి ఎక్కువ. అవి అసాధారణ వినికిడి శక్తి కలిగి ఉంటాయి. అవి అంతరిక్షంలోని ఇన్ఫ్రాసోనిక్ శబ్దాలను కూడా వినగలవట. మనుషులకు ఏ మాత్రం వినిపించని 20 Hz కంటే తక్కువ శబ్దాలను కూడా కుక్కలు గ్రహిస్తాయని, అందుకే మనకు తెలియని విషయాలపైనా అవి ప్రతిస్పందిస్తాయని చెప్తుంటారు. భూకంపాలు వచ్చినపుడు కూడా అవి ముందస్తుగా మేల్కోవడానికి కారణం అదే. శబ్దాలకు ప్రతిస్పందిస్తూ అవి అరుస్తాయి లేదంటే ఊలలు వేస్తాయి.
తోడేళ్ల జాతి నుంచి వచ్చిన కుక్కలు మొరిగే లక్షణాలను వారసత్వంగా అందిపుచ్చుకున్నాయి. కుక్కలకు వాసన గ్రహించే శక్తి మనుషుల కంటే ఎక్కువే. అవి చుట్టూ ఉన్న వాసనలను గుర్తించి, అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తాయి. తోడేళ్ల వంశానికి చెందిన శునకాలు తోడేళ్ల మాదిరిగానే తమ గుంపుతో సంప్రదింపులు కొనసాగిస్తాయి. తమ భావాలను వ్యక్తపరచడానికి లేదా ఇతర కుక్కలతో సంభాషించడానికి తమదైన శైలిలో అరుస్తుంటాయి అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
సైన్స్ ఏం చెబుతోందంటే!
రాత్రిళ్లు కుక్కలు ఎందుకు మొరుగుతాయో HUFT Editorial ఓ ఆర్టికల్ ప్రచురించింది. మనుషుల మాదిరిగానే కుక్కలు కూడా సామాజిక జీవులే. రాత్రి వేళలో కూత పెట్టడానికి ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్న మాట. కుక్కలు ఒంటరిగా కాకుండా ఇతర కుక్కలతో లేదంటే తమ యజమానితో కలిసి ఉండడానికే ఇష్టపడుతుంటాయి. ముఖ్యంగా అవి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడో లేదంటే ఇతరుల/ కుక్కల దృష్టిని ఆకర్షించడానికో కూత పెడుతుంటాయి. అనారోగ్యంగా, శరీరంలో ఇబ్బందులు, అవయవాల నొప్పితో ఉన్నా అవి మొరగడానికి అవకాశం ఉంది. రాత్రిపూట తమ మంద గుర్తుకు వచ్చినా సరే కూత పెట్టేందుకు అవకాశాలున్నాయని సైన్స్ చెప్తోంది.
కుక్కలు తమ చుట్టూ ఉన్న పర్యావరణ మార్పులకూ సున్నితంగా స్పందిస్తాయి. వాతావరణంలో మార్పులు, ఇంట్లో మార్పులు కుక్కలు మొరగడానికి కారణమని పలు పరిశోధనలు వెల్లడించాయి.
పెంపకందారులు పరిశీలించాల్సిన అంశాలివే
కుక్క రాత్రిపూట ఎందుకు అరుస్తుందో తెలుసుకోవడానికి ముందుగా దాని ప్రవర్తనను గమనించాలి. కుక్క ఆకలి లేదా అనారోగ్యంతో ఉందేమో తెలుసుకొని తగినంత శ్రద్ధ తీసుకోవాలి. తగినంత వ్యాయామం చేయించడంతో పాటు తగిన ఆహారం అందించాలి. పెంపకందారులు తమ శునకాలను తరచూ వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి.
కాలినడక భక్తులకు కంకణాలు - 2, 3గంటల్లో శ్రీవారి దర్శనం!
మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా? - IRCTC సూపర్ ప్యాకేజీ!