Telangana Caste Census Resurvey Today : గతంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారి వివరాలను నేటి నుంచి నమోదు చేయనున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగినవారి వివరాలు నమోదు చేసుకునేలా ప్రణాళిక శాఖ ఏర్పాట్లు చేసింది. కులగణన కోసం 040-21111111 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. ఆ నంబరుకు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవో కార్యాలయాలు.. పట్టణాలు, నగరాల్లో వార్డు, డివిజన్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అక్కడ శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు ఉంటారని వివరించారు కులసర్వే వెబ్‌సైట్ నుంచి ఫారం డౌన్‌లోడ్ చేసుకొని, నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు.
రాష్ట్రంలో ఇంటింటి సర్వేచేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి4న కేబినెట్, అదే నెల 16న అసెంబ్లీ తీర్మానం చేశాయి. ఇంటింటి సర్వే కులగణనకి అవసరమైన విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో సెప్టెంబరు 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతని ప్రణాళికశాఖకి ప్రభుత్వం అప్పగించింది. నవంబరు 6 నుంచి సుమారు లక్ష మంది ఎన్యుమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటిసామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు.
ఈనెల 28 వరకు సర్వే :డిసెంబర్ తొలివారంలో సర్వే పూర్తైంది. రాష్ట్రవ్యాప్తంగా 96.90శాతం సర్వే జరిగిందని 3,54,77,554 మంది వివరాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతోపాటు కొన్నిచోట్ల ఎన్యుమరేటర్ల లోపంతో రాష్ట్రవ్యాప్తంగా 3,56,323 కుటుంబాలకు చెందిన సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. మిగిలిన 3.10 శాతం మందికి సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 28 వరకు సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసింది.