Another Person Died Due to Diarrhea in Guntur:గత కొన్ని రోజులుగా గుంటూరులో డయేరియా కేసులు (Diarrhea cases in Guntur) పెరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పైపు లైన్లు పాడైపోయిన చోట కొత్తవాటిని అమర్చడం, లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల గుంటూరులో డయేరియాతో యువతి మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. గుంటూరులో ఇటీవలే కలుషిత నీరు తాగి దాదాపు 80 మంది జీజీహెచ్లో చేరారు. వారిలో షేక్ ఇక్బాల్ 4 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయం మృతి చెందిన ఇక్బాల్ కుటుంబ సభ్యులను టీడీపీ ఇన్ఛార్జీ నజీర్ పరామర్శించారు. షేక్ ఇక్బాల్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
డయేరియాపై మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ నేతలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు: నగరంలో కలుషిత నీటి సమస్య (Contaminated water problem in Guntur) ఉన్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపు లైన్లు పాడైపోయిన చోట మరమ్మతులు చేయకుండా ఉండటం వల్లే తాగునీరు కలుషితమవుతోందని నగర వాసులు అంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. తాగునీరు కలుషితం అవుతుందని ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే మరణాలు సంభవించేవి కాదన్నారు. శ్రీనగర్, సంపత్ నగర్, నెహ్రూనగర్, సంగడిగుంట, శారదా కాలనీ ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు.