Children on Social Media :పిల్లలు ఫోన్లలో సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను విద్యా ప్రయోజనాల కోసం కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం ఉంటున్నారని వార్షిక విద్యాస్థితి (అసర్) నివేదిక- 2024 తెలిపింది. ఇందులో చాలా మందికి ఆన్లైన్లో తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి కావాల్సిన డిజిటల్ అక్షరాస్యత లేదు. రాష్ట్రంలో 1775 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొనగా వీరిలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందినవారే ఎక్కువ ఉన్నారు.
సామాజిక మాధ్యమాలకే అధిక సమయం : 14-16ఏళ్ల పిల్లలున్న 96%గృహాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 14ఏళ్ల పిల్లలు 31.10%, 15ఏళ్లవారు 29%, 16ఏళ్లవారు 46.60% మంది సొంతంగా స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న 14-16ఏళ్ల విద్యార్థులు 82.50% మంది సామాజిక మాధ్యమాలను వీక్షించటానికే అధిక సమయం కేటాయిస్తున్నారు. వీరిలో బాలురు84.80%, బాలికలు 79. 90%మంది ఉన్నారని నివేదిక తెలిపింది. సామాజిక మాధ్యమాల అధిక వినియోగం పిల్లల భవితపై పెనుప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కలవరపరుస్తున్న డిజిటల్ అక్షరాస్యత : వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్ కలిగిన 14ఏళ్ల పిల్లల్లో కేవలం 55.10% మందికి మాత్రమే తమ ప్రొఫైల్‌ను ఎలా బ్లాక్ చేయాలో తెలుసు. 15ఏళ్ల పిల్లల్లో 62.30% మాత్రమే తమ పాస్‌వర్డును మార్చగలరు. 16ఏళ్ల వయసు వారిలో 70% మందికే ప్రొఫైల్ బ్లాక్ చేయటం, మార్చటం, కొత్త పాస్‌వర్డ్ నమోదు చేయటం వంటి వాటిపై అవగాహన ఉంది. పిల్లల్లో డిజిటల్ అక్షరాస్యత లేకపోవటం వల్ల సైబర్ మోసాలకు గురవటం, ఆన్‌లైన్ జూదాలు, లోన్‌యాప్‌ల బారినపడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.