Anemia Committees at The Village level in Manyam District :గిరిజనుల్లో మాతాశిశు మరణాలను పార్వతీపురం మన్యం జిల్లా అధికారులు గణనీయంగా తగ్గిస్తున్నారు. గర్భిణుల్లో రక్తహీనత కారణంగా మరణాలు పెరుగుతుండటాన్ని గుర్తించిన అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు. వీరి కృషికి ప్రధాన మంత్రి అవార్డు లభించింది.
అమ్మతనంలోని ఆనందాన్ని అందుకోవాలనే మహిళల కలల్ని రక్తహీనత అనే వ్యాధి కకావికలం చేస్తోంది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. అందులోనూ అధిక శాతం గిరిజన ప్రాంతాలతో విస్తరించిన పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో నిలుస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలో ఏటా సరాసరిన 13 వేలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా చాలా మంది గర్భిణులది ప్రమాదకర పరిస్థితే.
పౌష్టికాహార లోపం, అవగాహన లేమి, రక్తహీనత కారణాలతో హైరిస్క్ కేసులుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్తహీనత నివారణకు జిల్లా అధికారులు పెద్దఎత్తున చర్యలు చేపట్టారు. 2023-24లో అప్పటి కలెక్టర్ నిశాంత్ కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయిలో రక్తహీనత కమిటీలు ఏర్పాటు చేశారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పౌష్టికాహారం అందించడమే కాకుండా దత్తత అధికారులను నియమించారు. ఇందులో భాగంగా ఒక్కో అధికారి రక్తహీనత ఉన్న ఒక్కో గర్భిణీని దత్తత తీసుకోవడం, వారికి పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యాన్ని బట్టి సమయానికి మందుల అందించడం, నిత్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం వంటివి చేశారు. ఈ చర్యలు సత్ఫలితాలిచ్చాయి. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2023-24 ఏడాది నిర్వహించిన ప్రిజం-10 కార్యక్రమానికి ప్రధానమంత్రి అవార్డు దక్కింది.