AP Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works : కృష్ణా జిల్లాలోని బుడమేరు మూడో గండిని పూర్తిగా పూడ్చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. దీంతో దిగువకు వెళ్లే వరద నీటి ప్రవాహం తగ్గింది. ఇవాళ్టితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగించామని తేల్చి చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమకష్టం చాలా తక్కవ అని ఆయన అన్నారు.
గండ్లు పడటంతో పోటెత్తిన వరద : బుడమేరుకు భారీగా గండ్లు పడటంతో విజయవాడలోని పలు కాలనీలకు వరద పోటెత్తింది. యుద్ధప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది. సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడించింది.
గేబియాన్ బుట్టలతో పూడ్చుతాం :బుడమేరుకు గండ్లు పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్నట్లు గుర్తించామని ఆర్మీ అధికారులు తెలిపారు. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉందని, వీటిని గేబియాన్ బుట్టలతో పూడ్చుతామని చెప్పారు. మొదట గేబియాన్ బుట్టలు పేర్చి తర్వాత రాళ్లు వేస్తామని, బుట్టలను పటిష్ఠం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తామని వివరించారు. గేబియాన్ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోందని, ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతామని చెప్పారు. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఏడీఆర్ బృందం పని చేస్తోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.