IAS Praveen Prakash VRS : వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్)కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. వీఆర్‌ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇంకా ఏడేళ్ల సర్వీస్ ఉన్న ఆయన గత నెల 25న వీఆర్‌ఎస్‌కు అర్జీ చేసుకోగా ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించింది.
వైఎస్సార్సీపీతో అంటకాగిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఇటీవల ఏపీ సర్కార్ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. వీఆర్‌ఎస్‌కు అర్జీ చేయడంలోనూ ఆయన వివాదం సృష్టించారు. వీఆర్‌ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. ఒక సభలో బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్ల వద్ద కూర్చొని మాట్లాడటంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
Praveen Prakash Voluntary Retirement : వైఎస్సార్సీపీతో అంటకాగిన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ హోదా చివరికి వీఆర్‌ఎస్‌తో ముగిసింది. ఆ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ, ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తనకో మంచి ప్రైవేట్ జాబ్ చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్‌కు వాట్సప్‌లో సందేశం పంపడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఒకసారి ప్రకటించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం సాగింది.
ఎన్నో అక్రమాలకు సహకారం : వైఎస్సార్సీపీ సర్కార్‌లో ప్రవీణ్ ప్రకాష్ మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా పని చేశారని, ఎన్నో అవకతవకలకు సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, కోడిగుడ్లు, చిక్కీల సరఫరా టెండర్ల పొడిగింపులో మాజీ మంత్రి చెప్పినట్లే ఆయన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మూడు సంవత్సరాల పాటు రూ.150 కోట్లు విలువ చేసే చిక్కీల టెండర్లను పొడిగించారు. 2024-25 విద్యా కానుక కొనుగోళ్లలోనూ అవకవతలకు పాల్పడ్డారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలపకపోయినా రూ.772 కోట్లతో కొనుగోలు చేసేందుకు పాత గుత్తేదార్లకే ఆర్డర్ ఇచ్చేయడంపైనా అనేక ఆరోపణలున్నాయి.