Andhra Pradesh Debts :కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అప్పులు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలనూ కొత్త ఏడాది చెల్లించేలా ఆర్థికశాఖ అధికారులు ప్రణాళిక రచించడంతో తొలి రెండు నెలల్లోనే విచ్చలవిడి అప్పులకు పచ్చజెండా ఊపేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే బహిరంగ మార్కెట్ రుణం మొత్తం 21వేల కోట్లకు చేరిపోయింది. ఈ స్థాయిలో రిజర్వుబ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో సగటున నెలకు 5,000 కోట్లకు మించి రుణాలు తీసుకున్న సందర్భాలు లేవు. జగన్ సర్కార్‌లో నెలకు అవి 7,000 కోట్లకు చేరి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా నెలకు 10వేల కోట్లు రుణాలు సమీకరించడం గమనార్హం. ఏప్రిల్‌లో 10వేల కోట్లే రికార్డు అనుకుంటే మే నెలలో దాన్ని 11వేల కోట్లకు చేర్చారు. ఇలా అయితే ఏడాది మొత్తానికి ఒక్క బహిరంగ మార్కెట్ రుణమే లక్ష కోట్లకు మించిపోనుంది.
సీఎం జగన్ చూపించని అప్పులు రాష్ట్రానికి చాలానే ఉన్నాయి: ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు ఎస్.అనంత్
మార్చి నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు ఇండికేటివ్ క్యాలెండర్ పంపింది. తొలి మూడు నెలల్లో ఏ వారం ఎంత రుణం తీసుకోనున్నారో తెలియజేసింది. ఏప్రిల్‌లో 13వేల కోట్లు, మే నెలలో 5,000 కోట్లు రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలే విస్మయం కలిగించాయి. కానీ వాస్తవానికి 21వేల కోట్ల మేర అప్పులు పుట్టిస్తున్నారు. ఈ నెలలో చివరి మంగళవారం మే 28న మరో 2వేల కోట్ల రుణం కావాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం వర్తమానం పంపింది. అదీ కలిపితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో అప్పు 21 వేల కోట్లకు చేరిపోతుంది.