Model Code of Conduct in Andhra Pradesh:సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటన తర్వాత కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాని ఫోటోలను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే: కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్ లు, హోర్డింగ్ లు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్థంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల వద్ద ప్రకటనలు, హోర్డింగులపై రాజకీయ పార్టీ నేతలు, ప్రకటనలు, పోస్టర్లు తొలగించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను తొలగించాల్సిందిగా స్పష్టం చేశారు. అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులకూ ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు.
సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించవద్దు: నిమ్మగడ్డ రమేష్ కుమార్