AP MLA Swearing Ceremony 2024 : ఏపీలో శుక్రవారం (జూన్ 21వ తేదీ) అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మహిళా సభ్యులు అనంతరం ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. సాధారణ సభ్యులుగానే జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. సభ్యుల సీటింగ్ ఆంగ్ల అక్షరాల ప్రాతిపదికన ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని తెలిపారు.
సందర్శకులకు ప్రవేశం లేదు.. శుక్రవారం, శనివారం జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు సందర్శకులకు ప్రవేశం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కోసం కుటుంబసభ్యులతో సహా ఎవరికి విజిటింగ్ పాస్లు జారీ చేయడం లేదన్నారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్లు రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంల ప్రమాణం చేయనున్నారు.
ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం:తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. గోరంట్లతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ సహా ఇతర సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.