Anantapur Police Arrested Interstate Robbers Gang:అతనో లారీ డ్రైవర్. హర్యానాలో ఉంటూ వివధ రకాల సరకులను ఆంధ్రప్రదేశ్‌కు లారీలో తీసుకువస్తుంటాడు. అలా వచ్చి వెళ్తుంటే బాగానే ఉండేది. కానీ అతను చేసే పని మరొకటి ఉంది. సరకులను డౌన్లోడ్ చేసి వెళ్తూ జాతీయ రహదారి పక్కన ఉండే ఏటీఎంలపై కన్నేస్తాడు. జన సంచారం లేని, కాపలదారు లేని కేంద్రాలను పరిశీలించి హర్యానాలోని తన ముఠా సభ్యులైన రాబిన్, సలీంలు సమాచారమిస్తాడు.
అంతే రాబిన్, సలీంలు రంగంలోకి దిగుతారు. అర్ధరాత్రి కొంతమందిని తమతోపాటు తీసుకువచ్చి ఏటీఎంలను కొల్లగొడతారు. తస్కరించిన నగదును వెంటనే లారీ డ్రైవర్, వాళ్లకు సమాచారమిచ్చిన షాకీర్‌తో హర్యానాకు లారీలో పంపిస్తూ ఉంటారు. అంతా సద్దుమణిగిన తర్వాత అక్కడ వాటాలు పంచుకుంటారు. వీళ్లు ఎక్కువగా కొల్లగొట్టిన ఏటీఎంలు ఎస్బీఐకు చెందినవే ఉంటాయని పోలీసుల విచారణలో బయటపడింది.
ఎలా చిక్కారంటే?: ఈ నెల 4న అనంతపురంలోని రామనగర్ కాలనీ ప్రధాన రహదారిలో ఉన్న ఏటీఎంలో దోపిడీ జరిగింది. 30 లక్షల రూపాయలు చోరీ కావడంతో సీసీఎస్, అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంతర్రాష్ట్ర దొంగలైన హర్యానా ముఠా గుట్టు బయటపడిందని ఎస్పీ జగదీష్ తెలిపారు. సినిమా తరహాలో రెక్కీ నిర్వహించి దోపిడీలకు పాల్పడుతుంటారని అన్నారు.
ఎస్బీఐకి ఎక్కువ మంది వినియోగదారులు ఉండటం, ఏటీఎంలలో అధికంగా నగదు పెట్టడంతో పాటు ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు లేకపోవడం ఈ ముఠా దోపిడీలు చేసేందుకు కలిసి వచ్చిందని చెప్పారు. ఈ ముఠా ఏపీతో పాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 ఏటీఎం కేంద్రాల్లో దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారని ఎస్పీ జగదీష్ తెలిపారు.