Amulyam Arts And Gifts In Hyderabad : మార్కెట్‌లో ఎక్కువగా వినియోగంలో ఉండే వ్యాపారం చేయాలుకున్నారు త్రిషాలా, సుశాంత్ దంపతులు. ప్రతి ఇంట్లో ఉపయోగించే పచ్చళ్లను తయారు చేసి విక్రయించే వ్యాపారం ఎంచుకున్నారు. గదిలో వివిధ రకాల పచ్చళ్లు చేయించి వాటిని సీసాల్లో నింపి విక్రయించడం మొదలు పెట్టారు. వ్యాపారం మొదలు పెట్టిన నెలల్లోనే కరోనా మహమ్మారి కమ్మేసింది. వ్యాపారం దివాలా తీసింది. కనీసం మార్కెటింగ్ కూడా చేసుకోక ముందే పచ్చళ్ల వ్యాపారం దెబ్బతినడంతో త్రిషాలా, సుశాంత్ దంపతుల ఆలోచన మరో వైపు మళ్లింది.
Amulyam Special Gift Store in Hyderabad :ప్రతి వేడుకకు బహుమతులు ఇవ్వడం పరిపాటి. ఈ బహుమతుల పరిశ్రమ దినదినాభివృద్ది చెందుతోంది. ఈ రంగంలో అడుగు పెట్టారు ఈ దంపతులు. అయితే మార్కెట్‌లో అన్ని చోట్లా దొరికే బహుమతుల్లా కాకుండా మనసుకు హత్తుకుపోయే విధంగా పలు రకాల వస్తువులు విక్రయించాలనుకున్నారు. దీనికోసం పలువురు డిజైనర్లు, కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఖరీదైన బహమతులైనా సరే వాటిని ఒక్కసారి ఇస్తే జీవితాంతం గుర్తుంచుకోవాలనే కాన్సెప్ట్‌తో భిన్నమైన బహుమతులు, వస్తువులు అందుబాటులో ఉంచారు. వస్తువులకు తగిన విధంగానే వాటికి "అమూల్యం" అనే పేరుతో స్టోర్ పెట్టి విక్రయిస్తున్నారు. పర్యావరణానికి హానీ కలగకుండా రూపొందించిన వస్తువుల మాత్రమే అమూల్యం స్టోర్‌లో లభ్యమవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు.
డైనింగ్ టేబుల్‌పై ఉపయోగించే వస్తువులు ఎక్కువ శాతం పింగాణితో తయారు చేస్తారు. కానీ అమూల్యంలో లభించే టేబుల్ వేర్ మాత్రం నాణ్యమైన ముడి సరుకును ఉపయోగించి దానిపైన అరుదైన కళతో రూపొందిస్తున్నారు. అంతరించిపోతున్న కళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ప్లేట్లు, చెంచాలు, టీ కప్పులు, ట్రేలు తయారు చేస్తున్నారు. ముడి సరుకు నుంచి ప్రతి వస్తువు కూడా దేశంలో తయారు చేసినవేనని సుశాంత్ చెబుతున్నారు.