Amit Shah Tour In Telangana News : లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఒక్కరోజు హైదరాబాద్ పర్యటన కొనసాగింది. బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌షా కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అనంతరం బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్లమెంట్ కన్వీనర్లు, ఇన్‌ఛార్జీలు, పొలిటికల్ ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిణామాలపై అడిగి తెలుసుకున్నారు.
Telangana BJP on Lok Sabha Polls 2024 : ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై ఆరా తీశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ చర్చలు సాగాయి. ఈ సమావేశంలో అమిత్ షా వారికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సర్వేల ప్రకారం తెలంగాణలో 12 సీట్లు గెలువబోతున్నట్లు సమాచారం ఉందని ఇంకా కష్టపడితే 15 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని వారికి పిలుపు నిచ్చినట్లు తెలిసింది. బూత్ కమిటీలు ఉన్నాయా? లేదా ముందుగానే చెక్ చేసుకుని, దాని ఆధారంగా వ్యూహాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో బీజేపీకి 12 కంటే ఎక్కువ స్థానాలు రావడం ఖాయం : అమిత్‌షా
Amit Sha on Telangana MP Seats :ప్రతి పార్లమెంట్‌కి 50 మందితో ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంట్ కన్వీనర్లు, ఇన్ చార్జీలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు వారితో ఫోన్లు చేయించి ఓటు బీజేపీకి వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. తాను తన పార్లమెంట్ పరిధిలో 3 లక్షల మందితో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానని, ఇక్కడ కూడా అలా చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని ఆయన వివరించినట్లు తెలిసింది.