Amaravati Drone Show: విజయవాడ కృష్ణ నది తీరంలో జరిగిన అతిపెద్ద డ్రోన్ షో వీక్షకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ ప్రదర్శన అయిదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మేర ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సర్టిఫికెట్లు అందజేశారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట డ్రోన్ షో మొదటి రికార్డు సాధించగా, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టించటం పేరిట రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డు నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో గిన్నీస్ రికార్డు సాధించింది. ఏరియల్ లోగోతో డ్రోన్ షో అయిదో రికార్డు అందుకుంది. 5 గిన్నిస్ రికార్డుల్లో పోటీపడిన అమరావతి డ్రోన్ ప్రదర్శన చరిత్ర సృష్టించింది.
కనువిందు చేసిన నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి:డ్రోన్ షోలో ఒకే సారి 5500 డ్రోన్ల లైటింగ్‌తో ఆకాశంలో వివిధ ఆకృతులను ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా భారీ ప్రదర్శన సాగింది. 1911 నాటి పోస్టల్ స్టాంప్ ఆకృతి కనువిందు చేసింది. కళ్లు చెదిరేలా ఆకాశంలో నుంచి విమానం ఆకృతిలో వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆకాశం నుంచి ఒక్కసారిగా ఉట్టిపడినట్లు గౌతమబుద్ధుని ప్రతిమ డ్రోన్లతో దర్శనమిచ్చింది. ప్రదర్శన తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
డ్రోన్ల సాంకేతికత గేమ్ ఛేంజర్ -రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపద: చంద్రబాబు