Amaravati Capital Region Funds Nearly Doubled in Budget : వైఎస్సార్సీపీ సర్కారు విధ్వంసక విధానాల వల్ల నిలిచిన రాజధాని నిర్మాణాన్ని మళ్లీ పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్‌లో అమరావతికి రూ.3,445.33 కోట్లు కేటాయించింది. ప్రధాన మౌలిక వసతులకు రూ.3,000 కోట్లు నిధులను సమకూర్చింది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు రూ.400 కోట్లు, అమరావతి స్మార్ట్‌సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు రూ.32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతుల కల్పనకు రూ.13.33 కోట్లును వెచ్చించనుంది.
రాజధానికి నిధులు : ఐదేళ్ల అనంతరం మళ్లీ బడ్జెట్‌లో అమరావతి ప్రస్తావన ప్రముఖంగా కనిపించింది. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని దాదాపుగా కొలిక్కి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేయడంతో రాజధాని పనులు పరుగులు పెట్టబోతున్నాయి. రాజధానికి సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసానివ్వడం, ప్రపంచబ్యాంకు (World Bank), ఏడీబీల (ADB) నుంచి రూ.15,000 కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి రావడం, రూ.12,000 కోట్లు ఇచ్చేందుకు హడ్కో అంగీకరించడంతో ఆర్థిక వనరుల లోటు తొలగిపోయింది.
అమరావతికి రైలు కూత - కొత్త లైన్‌పై హర్షాతిరేకాలు - త్వరలోనే భూసేకరణ
ఇక నాలుగు నెలలే సమయం : రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు (World Bank), ఏడీబీ (ADB- Asian Development Bank) కలిసి రూ.15,000 కోట్ల రుణం ఇస్తున్నాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని సీఆర్‌డీఏకు (CRDA) విడుదల చేసేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక హెడ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం (నవంబర్ 10న) ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రతిపాదన ఆధారంగా హెడ్ కిందే వార్షిక బడ్జెట్‌లో రూ.3,000 కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక నాలుగు నెలలే మిగిలి ఉంది.