Tiger Roaming In Alluri District:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు తెలిపారు. ఆదివారం ఉదయం డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొంతమంది వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దారకొండ ఘాటి రాదారిలోని సప్పర్ల రెయిన్ గేజ్ వద్ద పులి కనబడినట్లు గిరిజనులు పేర్కొన్నారు.ఈ అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని పెద్దపులి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు.
గతంలో సైతం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొద్దిరోజులుగా పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఎదురుగా ఉన్న పెద్దపులిని చూసి గ్రామానికి పరుగులు తీసిన ఘటన కలకలం రేపంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అడ్డతీగల మండలం కినపర్తి చెందిన ఓ యువకుడు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పొలానికి వెళ్తుండగా ఎదురుగా పెద్దపులి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు అక్కడే ఉన్న తన భార్యను తీసుకొని పరుగులు పెట్టాడు. మార్గమధ్యలో పడుతూ లేస్తూ చివరికి గ్రామానికి చేరుకొని ఇద్దరూ పడిపోయారు.
వెంటనే గ్రామస్థులు ఆ దంపతులను స్థానికి ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తరువాత తన కళ్లారా పెద్దపులిని చూసిన సంఘటనను ఈటీవీ భారత్కు తెలియజేశాడు. ఇటీవలే రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఉందని పలువురు రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా యువకుడు స్వయంగా చూడడంతో రైతుల్లో మరింత భయాందోళన నెలకొంది.