Allu aravind On Sritej Health :సంధ్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పుష్ప-2 చిత్ర బృందం 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. అల్లు అర్జున్ కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలతోపాటు నిర్మాతలు రూ.50 లక్షల రూపాయలను రేవతి కుటుంబానికి ఇస్తున్నట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అల్లు అరవింద్ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. మరోవైపు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఎఫ్డీసీ ఆధ్వర్యంలో రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం :హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పుష్ప చిత్ర బృందం ముందుకొచ్చింది. శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ మేరకు కిమ్స్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని మరోసారి కలిసిన ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్‌లు 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అల్లు అర్జున్ తరఫున రూ.కోటి రూపాయలు :శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌తో మాట్లాడి పుష్ప చిత్ర బృందం తరఫున అందించే ఆర్థిక సాయన్ని గురించి దిల్ రాజు వివరించారు. అనంతరం మీడియా సమక్షంలో పరిహారం వివరాలను వెల్లడించిన అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ తరపున రూ.50 లక్షలు, మైత్రీ మూవీస్ నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ల తరపున రూ.50 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ నిర్మాతలు మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో 50 లక్షల రూపాయల చెక్‌ను శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు అందించారు. మిగతా కోటి 50 లక్షల రూపాయల చెక్కులను తమ న్యాయవాది సలహా మేరకు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అందిస్తున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.
"బాలుడు(శ్రీతేజ్) త్వరలోనే కోలుకుని మనందిరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడకు రావడానికి కారణం శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు. మా తరఫు నుంచి (అల్లు అర్జున్ తరఫు) కోటి రూపాయలు, నిర్మాతలు రవి, నవీన్ కలిపి రూ.50 లక్షలు మైత్రీ తరఫున, సుకుమార్ తరఫున రూ. 50 లక్షలు ఇచ్చారు. ఈ మొత్తం 2 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కును ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుకు ఇచ్చాం. వాటిని బాధిత కుటుంబానికి అందజేయాలని విజ్ఞప్తి చేశాం"- అల్లు అరవింద్, నిర్మాత