Allu Aravind On Thandel Movie piracy Issue :అంతా తెలిసే, కావాలని చిత్రాన్ని పైరసీ చేస్తున్నారని ‘తండేల్’ సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగచైతన్య కథానాయకుడిగా, సాయిపల్లవి హీరోయిన్గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు. అంతేకాదు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ప్రెస్మీట్లో మాట్లాడారు.
పైరసీ సెల్‌ను ఇంకా బలోపేతం చేయాలి :ఫిల్మ్ ఛాంబర్ చర్యల వల్ల కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ జరగడం లేదని, అయితే రెండు నెలల నుంచి మళ్లీ ఈ రాక్షసి విరుచుకుపడుతోందని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గేమ్ ఛేంజర్’ను ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారన్నారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించినట్లుగా వివరించారు. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
క్వాలిటీ ప్రింట్ ఎక్కువగా వచ్చేస్తోందని అల్లు అరవింద్ అన్నారు. వాట్సప్ గ్రూపుల్లో సంబంధిత లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారని తెలిపారు. ఇలా చేస్తున్నటు వంటి వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించామన్నారు. వారి సమాచారాన్ని సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి తీసుకెళ్లామని అల్లు అరవింద్ తెలిపారు. వారందనినీ అరెస్ట్ చేయిస్తాం అని ఆయన తెలిపారు.
"వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు బీ కేర్ ఫుల్. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. మేము పట్టుదలతో ఉన్నాము. ఇదొక నేరం. ఇప్పుడు సైబర్ విభాగం సెల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం కూడా సులభమే. కొంతమంది వెబ్‌సైట్లలోనూ పెడుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ‘తండేల్’ సినిమా పైరసీ ప్రింట్ ప్రదర్శించడం దారుణం. మూవీ సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకంగా మారింది. పైరసీ సెల్‌ను మరింత బలోపేతం చేయాలి." - అల్లు అరవింద్, ప్రముఖ నిర్మాత