Alliance Leaders State Wide Election Campaign : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అయిదేళ్ల జగన్ ప్రభుత్వంలో ప్రజాపాలన జరగలేదని కేవలం రాక్షస పాలన సాగిందని తెలుపుతున్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తున్నారు.
జోరుగా ఓట్ల వేట - ప్రచారంలో దుసుకుపోతున్న కూటమి అభ్యర్థులు
గుంటూరులో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. యువతకు ఉపాధి కల్పన, సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ఏం చేస్తుందనేది వివరించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. రాష్ట్రంలో యువత తెలుగుదేశం వైపు చూస్తున్నారని గుంటూరు పశ్చిమ కూటమి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు.
Andhra Pradesh Elections 2024 : మైలవరం నియోజకవర్గలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పర్యటించారు. కొండపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కుమారుడు ధీమంత్ సాయి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.
తిరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు 11వ వార్డులోని ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. స్థానిక మేరీ మాత విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కొలికపూడి కోరారు. మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తపసపూడి, మంగినపూడిలో బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకుని తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు.
Election Campaign of TDP Candidates :నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఏ.ఎస్. పేట మండలంలో పర్యటించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. నెల్లూరు ఎంపీగా జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కావాలా ఏ మచ్చ లేని ప్రజలకు సేవ చేసే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కావాలో ఆలోచించాలని ఆనం రామనారాయణరెడ్డి కోరారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 40వ వార్డులో ప్రచారం నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ ప్రచారంతో దూసుకెళ్తోన్న టీడీపీ
నాయకులు, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. జగన్ అరాచకాలు పోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వరదరాజులరెడ్డి పిలుపునిచ్చారు. మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పట్టణంలోని కాలనీ వాసులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామనీ హామీ ఇచ్చారు.
"జగన్‌రెడ్డి నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు మాత్రమే. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల వల్ల అన్ని వర్గలకు న్యాయం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ భారం విపరీతంగా పెరిగిపోయింది. సొంత ఇల్లు ఉందన్న కారణంతో పింఛన్ ఇవ్వటంలేదని వృద్ధులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాలుగు వేలు పింఛన్ ఇస్తారు." - మాధవి రెడ్డి, కడప కూటమి అభ్యర్థి
అనంతపురం కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రెవెన్యూ కాలనీ, ఎర్రనేల కొట్టల కాలనీలో ప్రచారం చేశారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రజలకు వివరించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గ్రామాల్లో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్‌షో నిర్వహించారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం ఏర్పడితేనే అభివృద్ధి, సంక్షేమం రెండూ సాధ్యమవుతాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు బాగుపడతారన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు.శ్రీసత్యసాయి జిల్లా మడకశిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ రొల్ల మండలంలో పర్యటించారు. వృద్ధులకు మహిళలకు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. అక్కడి ప్రజల నుంచి సునీల్ కుమార్‌కు విశేష ఆధరణ లభించింది.
Election Campaign in AP : కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు. అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు బైక్‌పై తిరుగుతూ ప్రచారం చేశారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీలను కలిసి తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. సైకల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనకాపల్లి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మద్దతుగా సినీ నటుడు హైపర్ ఆది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కసింకోటలో ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్లమెంటు అభ్యర్థిగా సీఎం రమేష్‌ను గెలిపించాలన్నారు. వ్యాపారుల వద్దకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
శ్రీకాకుళం పార్లమెంటు కూటమి అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు నర్సన్నపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తితో కలిసి విస్తృత ప్రచారం చేశారు. నర్సన్నపేట మండలం జమ్ము గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. తర్వాత జలుమూరు మండంలోని గ్రామాల్లో పర్యటించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. రణస్థలం మండలం సంచాం గ్రామంలోని కొత్త చెరువు దగ్గర ఉపాధి హామీ కూలీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. కూటమి గెలుపునకు సహకరించాలని కోరారు.
ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు - వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
మరింత జోరుగా ఎన్నికల ప్రచారాలు - కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ