Aikya Vidya and Woxsen University Agreement : పిల్లలకు విద్యతో పాటు విలువలు, సంస్కారం, ఆత్మస్థైర్యం నేర్పించాల్సిన అవసరం ఉందని హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్, అక్షయ పాత్ర(Akshaya Patra)ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ అన్నారు. అక్షయ పాత్ర ద్వారా ఆహారం అందిస్తున్నామని, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఐక్య విద్య ద్వారా చదువు, విలువలు నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐక్య విద్యను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయంతో (Woxsen University) ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్లు ఆయన చెప్పారు.
ఈ మేరకు బంజారాహిల్స్‌లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో జరిగిన సమావేశంలో ఇరు సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ, వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాల్ విల్లామరిన్ రోడ్రీగే, ఐక్య విద్య డైరెక్టర్ సహదేవ సఖాదాస, వోక్స్‌సెన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్సెస్ డీన్ డాక్టర్ దయా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Akshaya Patra foundation President about Aikya Vidya : ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు సత్యగౌర చంద్ర దాస ప్రభుజీ మాట్లాడారు. ఐక్య విద్య(Aikya Vidya), వోక్స్‌సెన్‌తో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ తెలిపారు. ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లలు హోమ్ వర్క్ చేయడం లేదని, దాని వల్ల వారిలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబోధన, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాధికారత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక పరివర్తన మొదలైన సామాజిక తోడ్పాటు వంటి కార్యక్రమాలు అందిస్తామన్నారు.