Specializations In BCA :ఇంజినీరింగ్ విద్యలో ఎన్నో రకాల బ్రాంచీలు, కోర్సులు, డిగ్రీలోనూ వివిధ రకాల సబ్జెక్టుల కాంబినేషన్లు. కానీ బీసీఏ మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ)లో చేరితే మాత్రం అందరూ ఒకే రకమైన సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి(2025-26) నుంచి ఈ విధానంలో మార్పులు రానున్నాయి. బీసీఏలోనూ బీటెక్ మాదిరిగా స్పెషలైజేషన్లు రానున్నాయి.
దేశవ్యాప్తంగా బీసీఏతో పాటు బీబీఏ కోర్సులు ప్రస్తుత అకడమిక్ ఇయర్లో యూనివర్సిటీ నిధుల సంఘం( యూజీసీ) నుంచి ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలోనే బీసీఏ కోర్సులో తీసుకురావాల్సిన సంస్కరణలు మార్పులు చేర్పులపై ఏఐసీటీఈ దృష్టిసారించింది. బీసీఏకు మోడల్ విద్యాప్రణాళిక తీసుకురావడం, ఎంట్రీ- ఎగ్జిట్ ఆప్షన్ తదితర అంశాలపై బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బీఎల్ మురళీధర నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నివేదికను అందజేసింది.
ముసాయిదా మోడల్ విద్యాప్రణాళికను విడుదల చేసిన ఏఐసీటీఈ దానిపై సూచనలను ఆహ్వానించింది. త్వరలోనే తుది విద్యాప్రణాళిక విడుదల చేయనుంది. బీబీఏకు తుది విద్యా ప్రణాళికను సంబంధిత అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
ఇవీ ముఖ్యమైన సిఫార్సులు
- 3 ఏళ్ల కోర్సయిన బీసీఏలో మూడో ఏడాది నుంచి స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టుకోవచ్చు. అందులో భాగంగా బీసీఏ(డేటా సైన్స్), బీసీఏ(ఏఐ అండ్ ఎంఎల్), బీసీఏ(ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్) లాంటి కోర్సులు తీసుకురావాలి.
- బీసీఏ ఆనర్స్, బీసీఏ ఆనర్స్ విత్ రీసెర్చ్ పేరిట 4 ఏళ్ల కోర్సులను అందించాలి. ఆనర్స్‌లో మూడు, నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్లు చదవాల్సి ఉంటుంది.
- బీసీఏలో ఏ స్పెషలైజేషన్ ఎంచుకున్నా ఫస్ట్ ఇయర్ రెండు సెమిస్టర్లలో అందరికీ ఒకే తరహా సబ్జెక్టులు బోధించాలి. రెండో ఏడాది నుంచి స్పెషలైజేషన్‌లో ఒక పేపర్ ప్రత్యేకంగా ఉండాలి. మూడు, నాలుగో సంవత్సరంలో పూర్తిగా స్పెషలైజేషన్‌ను చదువుతారు.
- పాఠ్యాంశాల్లో ప్రాక్టికల్స్ భాగం పెంచాలి. దానివల్ల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం విద్యార్థుల్లో పెరుగుతుంది.
- క్రెడిట్ విధానం ఉంటుంది. 3 ఏళ్ల కోర్సుకు 120, నాలుగేళ్ల కోర్సుకు 160 క్రెడిట్లు ఉంటాయి.