AICTE Grants Permission To Off Campus Colleges :అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలు ఆఫ్ క్యాంపన్ల ఏర్పాటుకు పోటీపడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో లేని కాలేజీలతో పాటు ఉన్నవి కూడా డిమాండ్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మరో కళాశాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతవరకు జేఎన్టీయూహెచ్కు 6 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆలస్య రుసుంతో దరఖాస్తుకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు గడువు ఉన్నందున ఆ సంఖ్య 10కి చేరుకోవచ్చని జేఎన్టీయూహెచ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సీట్ల పరిమితిని ఎత్తివేసిన ఏఐసీటీఈ - వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోరినన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లు
కళాశాలలను లీజు భవనంలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు, 75 కిలోమీటర్లలోపు ఉంటే అధ్యాపకులను రెండు కాలేజీల్లో బోధించేందుకు అనుమతించడం లాంటి పలు వెసులుబాట్లు కల్పించడంతో నగరానికి దూరంగా ఉన్న కళాశాలలు సైతం హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తిని వ్యక్తపరుస్తున్నాయి. ఇంతవరకు డీమ్డ్ యూనివర్సిటీలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. ఈసారి కొలమానాల ఆధారంగా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు సైతం అనుమతి ఇస్తున్నారు. దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత పరిశీలించి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర స్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.
ఏఐసీటీఈ కోసం ప్రత్యేక పోర్టల్.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన కిట్స్ స్టూడెంట్స్..
AICTE Approved Colleges in Telangana :కళాశాలల్లో మౌలిక సదుపాయలుంటే సీట్లు పెంచుకునే అవకాశాన్ని ఏఐసీటీఈ ఇవ్వడంతో ఈసారి పెద్ద సంఖ్యలో కాలేజీలు దరఖాస్తు చేస్తున్నాయని, ఇంకా ఎన్ని కళాశాలలు, ఎన్ని సీట్లన్నది లెక్కించలేదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓ కాలేజీ, ఘట్కేసర్ ప్రాంతంలోని మరో కళాశాల, జీడిమెట్ల సమీప ప్రాంతంలోని గ్రూపు సంస్థల యాజమాన్యం కూడా దరఖాస్తు చేసిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరో 3 ప్రముఖ కాలేజీలో కూడా దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో 156 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ప్రభుత్వ కలాశాలల్లో కలిపి ప్రస్తుతం మొత్తం 1.20 లక్షల బీటెక్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో మరో 8వేల వరకు ఉన్నాయి. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం (2024-2025)లో కనీసం మరో 15వేల సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.