AEO Dupes Rythu Bheema Victims Money :మృతి చెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కింద మంజూరు చేసిన సొమ్మును ఓ ఏఈవో తన ఖాతాలోకి మళ్లించుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఇలా మృతి చెందిన ముగ్గురి రైతు కుటుంబాల నుంచి రూ.13 లక్షలను తన ఖాతాలోకి ఏఈవో బదిలీ చేసుకున్నారు. దీనిపై ఒకరు ప్రశ్నించగా వారికి రూ.1.5 లక్షలు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో గుండ్రాతిమడుగు(వి)కు చెందిన వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) కల్యాణ్ చేసిన ఈ అక్రమాలపై బాధితులు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఏఈవో చేసిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
గుండ్రాతిమడుగుకు చెందిన షేక్ హుస్సేన్ అక్టోబరు 12న మృతి చెందగా నవంబరు 13న అతడి భార్య మైబ్ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు రైతు బీమా సొమ్ము జమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఈవో కల్యాణ్ ఆమెతో సంతకాలు చేయించి తన ఖాతాలోకి రూ.3 లక్షలు మళ్లించుకున్నాడు. మిగిలిన 2 లక్షల రూపాయలు ఆమెకు ఇచ్చాడు. మిగతా రూ.3 లక్షల రైతు బీమా సొమ్ము తర్వాత వస్తాయని నమ్మబలికాడు. 15 రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న మైబ్, ఏఈవోను ప్రశ్నించగా అతను రూ.1.50 లక్షలు ఇచ్చాడు.
నిలదీయగా చెక్కు రాసిచ్చాడు :ఇదే గ్రామానికి చెందిన మరో రైతు కేతం లక్ష్మణ్ మృతి చెందగా అక్టోబరు 25న నామినీగా ఉన్న అతని తల్లి వెంకట మల్లమ్మ ఖాతాలో రూ. 5 లక్షలు జమయ్యాయి. ఈ సొమ్మును కూడా ఏఈవో తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. దీంతో ఆమె ఏఈవో గురించి ఎంఈవోకి ఫిర్యాదు చేశారు. గేటుతండాకు చెందిన బానోతు బాలు సెప్టెంబరు 6న మృతి చెందగా ఆయన భార్య ఇరాని ఖాతాలో అక్టోబరు 18న రూ.5 లక్షలు బీమా జమయ్యాయి. ఈ సొమ్మును కూడా ఏఈవో తన ఖాతాలో వేసుకున్నాడు. 15 రోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఇరాని, ఏఈవోను నిలదీయగా చెక్కు రాసిచ్చాడు. దాన్ని బ్యాంకులో వేస్తే చెల్లలేదని ఆమె చెప్పారు.
సొమ్ము తీసుకున్న విషయం నిజమే : ఈ వ్యవహారాలపై ఏఈవో కల్యాణ్‌ను వివరణ కోరగా బాధితులను నుంచి సొమ్ము తీసుకున్న విషయం నిజమేనని కానీ అది అప్పుగా తీసుకున్నట్లు చెప్పారు. మండల వ్యవసాయాధికారి నర్సింహారావును కూడా దీనిపై ప్రశ్నించగా బాధితుల ఖాతాల్లోంచి ఏఈవో కల్యాణ్ సొమ్మును తీసుకున్నది నిజమేనని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వివరించారు. కురవి ఎస్సై సతీశ్‌ను సంప్రదించగా ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు.
బతికుండగానే భర్తలను చంపేసి! - బీమా డబ్బుల కోసం మరీ ఇంత దారుణమా