Agarwood Cultivation And Interesting Facts: ఏ మొక్కైనా లేదా చెట్టుకైనా తెగులు వస్తే అది ఎందుకూ పనికిరాదు. రకరకాల రసాయనాలు చల్లి వాటిని కాపాడుకుంటాం. అయితే ఈ ప్రంపంచంలో ఈ చెట్టుకు మాత్రం ఫంగస్ ఎక్కిస్తేనే బలంగా పెరుగుతుంది. అందుకే అది బంగారం కన్నా అధిక ధర పలుకుతుంది. ఇంతకీ ఆ చెట్టు ఏమిటో? ఫంగస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా!
రైతులకు లాభాలు తెచ్చిపెట్టే చెట్టు :ఫంగస్ కారణంగా సువాసనలు వెదజల్లే కలపనూ, నూనెనూ, మరికొన్ని ఉత్పత్తులను అందిస్తూ రైతులకు లాభాలు తెచ్చిపెట్టే చెట్టే అగార్ వుడ్. ఈ చెట్లకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. ఈ చెట్లను ఇప్పుడిప్పుడే మన దగ్గరా సాగు చేస్తున్నారు. బంగారం లాంటి ఈ చెట్టు ఒక్కటి ఉన్నా పెంచిన వారికి కాసులు కురిపించేస్తుంది.
సువాసనతో కూడిన అగరు బత్తీలను, అత్తరును అగార్ వుడ్‌తో తయారు చేస్తారు. దీన్ని సింగపూర్, లావోస్, తైవాన్, ఇండోనోసియా, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. అరబ్ దేశాల్లో కలపనూ, దానికి సంబంధించిన ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అసోం, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో అడుగుపెట్టిన అగార్ వుడ్ ఇటీవల తెలుగు రాష్ట్రాలకూ వచ్చేసింది. సువాసనలు వెదజల్లే కలప వృక్షాలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటిదే ఈ అగార్ వుడ్ కూడా.
నాలుగు సంవత్సరాలకే ఆదాయం : అయితే శ్రీగంధం, ఎర్ర చందనం చెట్లు ఆదాయం తెచ్చిపెట్టాలంటే దాదాపు పాతిక నుంచి ముప్పై సంవత్సారాలు ఆగాల్సిందే. అదే అగార్ వుడ్ చెట్లను సాగు చేస్తే నాలుగు సంవత్సరాలకే ఆదాయం వస్తుంది. ఒక్కసారి చెట్లను సాగు చేస్తే నలభై సంవత్సారాల పాటు పలు రకాలుగా లాభాలు తెచ్చిపెడుతుంది ఈ అగర్ వుడ్ చెట్టు. ఈ చెట్లు చాలా తొందరగా పెరుగుతాయి. నాటిన నాలుగు సంవత్సరాలకే చెట్టు లావు అయ్యాక, కాండానికి రంధ్రాలు చేసి ఫంగస్‌ను ఎక్కిస్తారు.
ఫంగస్‌ను చెట్టుకు ఎక్కించడం వల్ల కాండం లోపల రెజిన్ లాంటి పదార్థం విడుదలవుతుంది. అది కాండంతో కలిసిపోయి, కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడంతో అగార్ వుడ్ కలప సుగంధ భరితమవుతుంది. కాండంలోపల సువాసన వెదజల్లే కలప లేయర్ నల్లగానూ, ముదురు ఎరుపు రంగులోనూ ఉంటుంది. ఘాటైన సువాసనతో కూడిన ఆ భాగం రైతులకు భారీగానే లాభం చేకూర్చుతుంది.