Wedding Season : వివాహ సుముహూర్తాలకు వేళయ్యింది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభఘడియలు ప్రారంభం కానున్నాయి. వివాహాది గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎవరికి వారు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మూడు నెలలుగా ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. సుదీర్ఘ విరామానంతరం మూడుముళ్ల బంధానికి శుభ ఘడియలు ముందుకు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాజాలు మోగనున్నాయి.
వివాహాది శుభకార్యాలకు ఆగస్టు తర్వాత నవంబర్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. వెలుగుదివ్వెల పండగ దీపావళి పండుగ ముగిసిన వెంటనే భాజా భజంత్రీలు మోగనున్నాయి. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించేందుకు పండితులు ముహూర్తాలు పెట్టించేశారు. గత మూడు నెలలుగా శుభ ముహూర్తాలు లేకపోవడంతో ఆ సందడి తగ్గిపోయింది.
Pratidhwani: అసలేమిటీ పంచాంగం.. ఎందుకంత ప్రాముఖ్యం ?
ఆగస్టులో మొదలైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగిసింది. ఈ నేపథ్యంలో మూడున్నర నెలలుగా ఎంతగానో వేచి చూస్తున్నవారంతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు. శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను ఖరారు చేసుకుని పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నద్ధమయ్యారు.
రానున్న రెండు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. 60 రోజుల్లో వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఫొట్రోగాఫర్లకు చేతినిండా పని దొరకనుంది. ఇప్పటికే పలువురు ముందస్తు బుకింగ్లు చెల్లించి శుభకార్యాలకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ వాళ్లని బుక్ చేసుకుంటున్నారు.