Affordable Cardiac Care in NIMS Hospital :గుండె దడ బెంబేలెత్తిస్తోంది. ఎక్కువగా ఆల్కహాల్, కెఫిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం, గురక సమస్య ఉన్నవారు, పొగ తాగడంతో పాటు జీవనశైలిలో మార్పులు, పుట్టుకతోనే గుండెలో లోపాల కారణంగా అధిక శాతం మంది దడతో ఇబ్బంది పడుతున్నారు. గతేడాది ఒక్క హైదరాబాద్ నిమ్స్‌లోనే గుండె దడకు సంబంధించి 109 వరకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లెషన్ (ఆర్ఎఫ్ఏ) శస్త్రచికిత్సలు చేసినట్లు ఆసుపత్రి సీనియర్ ప్రొ.డా.ఓరుగంటి సాయి సతీష్ తెలిపారు. గతేడాది 100 సర్జరీలు చేసిన సందర్భంగా శనివారం నిమ్స్ ఆసుపత్రిలో ఇతర వైద్యులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, ఎక్కువ మంది సుప్రవెంట్రిక్యులర్ టకీకార్డియా రకం గుండె దడ బారిన పడుతున్నారని చెప్పారు. ప్రతి వెయ్యి మందిలో 3 నుంచి 5 మంది గుండె దడ సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. బాధితుల్లో 70 శాతం మంది 15 నుంచి 45 ఏళ్ల మధ్య వారున్నారని తెలిపారు.
గుండెలో నాలుగు గదులుంటాయని, కింద కుడి గది వైపు నుంచి ఊపిరితిత్తులకు, ఎడమ వైపు నుంచి శరీర భాగలకు రక్తం సరఫరా అవుతుందని డాక్టర్ సాయి సతీష్ వివరించారు. ఈ ప్రక్రియ కోసం గుండె కండరాలు సంకోచ, వ్యాకోచం చెందాలని అందుకు విద్యుత్తు ప్రసరణ శక్తి అవసరమన్నారు. ఇది గుండె కుడి వైపునకు ఉన్న సైనస్ నోడ్ అనే ప్రాంతం నుంచి ఒక నిర్ణీత మార్గంలోనే హృదయ కండరాలకు చేరుతుందని, అలా గుండె కొట్టుకుంటుందని తెలిపారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న గుండె సమస్యలు! - చలితో అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు