Drug Control Authority : మీ కిడ్నీల్లో రాళ్లున్నాయా? ఈ మందు తీసుకుంటే రాళ్లన్నీ మటుమాయం. షుగర్‌తో తీవ్రంగా బాధపడుతున్నారా? ఈ గోలీలు వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఈ మందులు వాడితే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుంది. ఇలా రకరకాల ప్రకటనలతో రోగులను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కులకు ఔషధ నియంత్రణ శాఖ (డీసీఏ) షాక్ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలిస్తున్న వారిపై ఏకంగా 176 కేసులు నమోదు చేసింది.
రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి లాభాపేక్షకు అడ్డుకట్ట వేసింది. ఇవే కాకుండా పలు రకాల అంశాలకు సంబంధించి మొత్తం 494 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం మెరుపు దాడులు జరిపారు. వివరాలను ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 02)న వెల్లడించారు.
ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మందుల విలువ దాదాపు రూ.3 కోట్ల 6 లక్షలు ఉంటుందన్నారు. చాలా మంది డీసీఏ (డ్రగ్ కంట్రోల్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీల పేరుతో వైద్య సేవలు అందిస్తూ వారి వద్దే మందుల నిల్వలు ఎక్కవగా స్టోర్ చేసుకుంటున్నారు. కొందరైతే అనుమతులు లేకుండానే మందులను తయారు చేసి అడ్డదారుల్లో, అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు డీసీఏ గుర్తించింది.
ప్రధానంగా నమోదైన కేసులు
- మందులపై తప్పుడు ప్రకటనలు- 176
- మందుల అక్రమ నిల్వ- 124
- అధిక ధరలకు అమ్మకాలు- 75
- అనుమతుల్లేకుండా విక్రయాలు-61
- అనుమతులు లేకుండా మందుల తయారీ- 41
- నకిలీ మందుల విక్రయాలు-8
- లైసెన్స్ లేకుండా కాస్మోటిక్స్ తయారీ- 5
- ఇతర కేసులు- 4