Addicted to Online Games And Committed Suicide Due to Debt :ప్రస్తుత పరిస్థితుల్లో మద్యపానం, ధూమపానం కంటే సెల్‌ఫోన్ వాడకం చెడు వ్యసనమైంది. అవసరానికి వాడుకుంటే ప్రయోజనం. కానీ కొందరు అతిగా ఆన్‌లైన్ ఆటలకు బానిసై రూ.కోట్లలో అప్పులు చేసి తీర్చే మార్గం లేక తమ పరువు ఎక్కడ పోతుందోనని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువతతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో చిక్కుకోవడం ఆందోళన కలిగించే విషయం.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశే ఇందుకు కారణం. నిజామాబాద్‌లో ఇప్పటి వరకు 57 రిజిస్టర్డ్ సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఫ్రాంచైజీల అమ్మకాలు, అశ్లీల వీడియోలతో ట్రాప్, బహుమతుల పేరిట మోసపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. స్థాయికి మించి అప్పులు చేయయం అవమానం తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. రెండేళ్లలో ఐదుగురు ఆన్‌లైన్ గేమింగ్స్‌కు వల్ల చనిపోవడం గమనార్హం.
- ఎడపల్లి మండలంలో కిరాణా కొట్టు నడుపుకునే దంపతుల కుమారుడు ఆన్‌లైన్ గేమింగ్స్‌కు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పరువు ఎక్కడ పోతుందో అని పొలం అమ్మి కట్టేశారు. అయినా తీరు మారని ఆ యువకుడు, మళ్లీ రూ.18 లక్షలు అప్పు చేశాడు. దీంతో బాకీ తీర్చే మార్గం లేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.
- మాక్లూర్ మండలానికి చెందిన దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులే. భర్త ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై రూ.2 కోట్లకు పైగా పోగొట్టుకున్నాడు. అప్పులు చేశాడు. వాటిని కట్టలేని పరిస్థితికి చేరి, అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
- జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. సొంతింటి కలను నిజం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలతో జీవితం సాగుతున్న సమయంలో అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. దొరికిన దగ్గర అప్పులు చేసి తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
- ప్రముఖ విద్యాసంస్థలో మంచి వేతనానికి ఓ యువకుడు అధ్యాపకుడిగా చేరాడు. ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడి బంధువులు, స్నేహితుల దగ్గర రూ.3 కోట్ల వరకు అప్పులు చేశాడు. తీర్చలేక ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడు.
- నందిపేట్ మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబం ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారు. ఆ ఇంట్లో ముగ్గురికి ప్రభుత్వ కొలువులు ఉన్నాయి. యువకుడు మాత్రం ఆన్‌లైన్ యాప్స్‌లో ఆటలు ఆడి రూ.90 లక్షలు పోగొట్టుకున్నాడు. తీరా తండ్రికి విషయం తెలిసి అప్పులు చెల్లించాడు.