Adani Group Investments In AP : ఏపీలో అభివృద్ధి పనుల కోసం అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టింది. డేటా సెంటర్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, గనులు, పోర్టులు, కృత్రిమ మేధ (ఏఐ), ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. స్వర్ణాంధ్ర సాధన, రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సంసిద్ధత తెలియజేసింది. అదానీ గ్రూప్ ఎండీ రాజేష్ అదానీ, అదానీ పోర్ట్స్, సెజ్‌లు, సిమెంట్స్ విభాగం ఎండీ కరణ్ అదానీ సహా అదానీ గ్రూప్ నుంచి భారీ బృందం రాష్ట్రానికి తరలి వచ్చారు.
సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశమైన అదానీ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో తమ గ్రూప్ పెట్టుబడుల ప్రతిపాదనలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను గురించి తెలిపారు. ఏయే రంగాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయో, వాటిలో తాము ఏ మేరకు తాము పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరమో వెల్లడించారు. అదానీ గ్రూప్ చేసిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుల్ని అమలు చేసేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబును కలిసిన వారిలో అదానీ పోర్ట్స్ సీఈఓ ప్రణయ్ చౌదరి, అదానీ థర్మల్ బిజినెస్ సీఈఓ ఎస్.బి.ఖ్యాలియా, బీచ్ శాండ్ బిజినెస్ సీఈఓ రాజేంద్రసింగ్, అదానీ పవర్ బిజినెస్ హెడ్ రాజ్‌కుమార్ జైన్, అదానీ గ్రూప్ ఐటీ హెడ్, ఛైర్మన్ సలహాదారు సుదీప్త భట్టాచార్య, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్పొరేట్ వ్యవహార హెడ్ పి.అంజిరెడ్డి కూడా ఉన్నారు. అదానీ గ్రూప్ ప్రతిపాదించిన ప్రాజెక్టులు సాకారమైతే రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ వంటి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్లేందుకు దోహదం చేస్తుంది.
"అదానీ గ్రూప్ ప్రతినిధులతో ఈరోజు విస్తృత చర్చలు జరిగాయి. పోర్టులు, గనులు, రింగ్‌రోడ్డు, ఐటీ, పర్యాటకం వంటి రంగాల్లో పెట్టుబడులకు వారు ఆసక్తి కనబరిచారు. అమరావతి నిర్మాణం, స్వర్ణాంధ్ర సాకారానికి తోడ్పడతామని తెలిపారు." - చంద్రబాబు, సీఎం
ఏపీ పెట్టుబడులపై అదానీ గ్రూప్ ముఖ్యమైన ప్రతిపాదనలు : రాజధాని ఇన్నర్‌రింగ్ రోడ్డు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిగా సొంత ఖర్చుతో చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది వరకే సిద్ధం చేసిన ఐఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో అవసరమైతే కొన్ని మార్పులు చేసి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధత చేస్తుంది. గతంలో ఏపీ ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్‌కు తగ్గట్టే ఐఆర్‌ఆర్‌ని ఫేజ్-1, ఫేజ్-2లుగా నిర్మించే ప్రతిపాదన.
బీచ్‌శాండ్ ఆధారిత ఉత్పత్తుల ప్రాజెక్టులు: బీచ్‌శాండ్ మైనింగ్, శుద్ధి వంటి పనులు చేస్తుంది. తొలి దశలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4, 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. ప్రత్యక్షంగా 4 వేల మంది, పరోక్షంగా 8 వేల నుంచి 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ప్రభుత్వానికి 30 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుంది.
విదేశీమారకద్రవ్యం ఆదా : టైటానియం డయాక్సైడ్ దిగుమతిని తగ్గించుకోవడం ద్వారా రూ.9 వేల కోట్లు విదేశీమారకద్రవ్యం ఆదాఅవుతుంది. ప్రాజెక్టు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆతిథ్య రంగం, మౌలిక వసతుల కల్పన, విద్యాకేంద్రాలు, వర్క్‌షాప్‌ల ఏర్పాటు. శ్రీకాకుళం, భీమునిపట్నం ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తారు. ఆర్‌ఓఎం శాండ్, డీస్లిమ్డ్ శాండ్, హెవీ మినరల్ ఉత్పత్తి చేస్తుంది. 1,034 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. 19 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉంటుంది. 0.12 మెగావాట్లు, 0.55 మెగావాట్లు, 6.83 మెగావాట్లు, 8 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల వారీగా అవసరం ఉంటుంది.