Murali Mohan on Joint Families :ఒకప్పుడు కుటుంబం అంటే జగమంత కుటుంబం! చాలా పెద్దగా ఉండేది. ముఖ్యంగా మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి. కానీ క్రమంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ఇవి కాస్తా చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. బలగం బలం తగ్గిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూలిపోతోంది. మన పెద్దలు కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలకే అన్నింటికంటే ఎక్కువ విలువ ఇచ్చేవారు.
కానీ అభివృద్ధి పేరుతో మనం పొరుగు దేశాల నుంచి నేర్చుకుంటున్న పాశ్చాత్య సంస్కృతి వల్ల, సమయాభావం వల్ల, ఇతర కారణాల వల్ల మానవ సంబంధాలకు ఉండే విలువ క్రమేపీ తగ్గిపోతోంది. నేటి ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరగవవుతున్నాయి. సభ్యుల మధ్య కూడా అనుబంధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దంపతులు ఉద్యోగాల పేరుతో నగరాలు, పట్టణాలకు వెళ్తున్నారు. ఇక పిల్లల ఆలనాపాలన చూసే తీరిక లేకుండా హడావిడి జీవితాలను గడుపుతున్నారు. దీంతో వీరి కోసమే అన్నట్టుగా ప్లే స్కూల్స్ పుట్టుకొచ్చాయి. పిల్లలను అందులో వదలి భార్యభర్తలు కార్యాలయాలకు వెళ్తున్నారు.
Tanuku Play School Inauguration : తాజాగా కుటుంబ వ్యవస్థపై సినీ నటుడు మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తలు ఉద్యోగస్తులయితే గతంలో పిల్లలను పెద్దవారు చూసేవారని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడంతో చిన్నారులను ప్లే స్కూల్స్లో చేర్పిస్తున్నారని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్లే స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.