Mohan Babu Apologizes to Journalist :హైదరాబాద్ శివారు ప్రాంతం జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మంచు మోహన్ బాబు తాజాగా స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఓ మీడియా ప్రతినిధిని కొట్టలేదని స్పష్టతను ఇచ్చారు. జర్నలిస్టులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. ఆదివారం (డిసెంబరు 15) సాయంత్రం సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి స్వయంగా వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు బహిరంగంగా ఆయన క్షమాపణలు చెప్పారు.
హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో సినీనటుడు మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం (డిసెంబరు 10న) రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసిన అనంతరం మనోజ్ మోహన్ బాబు నివాసానికి చేరుకోగా, సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. గేట్లు తీయకుండా మంచు మనోజ్‌ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లారు.
మీడియాపై చేయి చేసుకన్న మోహన్‌బాబు : ఆయనతో పాటు అక్కడ ఉన్న జర్నలిస్టులు, మీడియా సిబ్బంది కూడా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లారు. ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసంతృప్తి, కోపానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే కొందరు మీడియా ప్రతినిధులపై ఆయన పొరపాటున చేయి చేసుకున్నారు. దీంతో ఆ జర్నలిస్ట్‌కు ముఖంపై తీవ్ర గాయమైంది. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి అబ్జర్వేషన్లో పెట్టారు.