Actor Chiranjeevi Donates 1 Crore Rupees : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీనటులు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ రూ.కోటి చొప్పున విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తీవ్రంగా కలిచివేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఉపశమనానికి తోడ్పాటు : పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లోని ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా తన వంతుగా రూ.కోటి విరాళంగా ఇస్తున్నానని తెలిపారు.
సీజేఐ ఎన్వీ రమణ విరాళం : ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఇవాళ రూ.10 లక్షల చొప్పున సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులు అందజేశారు. అటు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తనవంతు సహాయంగా ఇరు రాష్ట్రాల బాధితుల కోసం చెరో రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. నటి అనన్య నాగళ్ల కూడా తన బాధ్యతను చాటుకుంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళాన్ని ప్రకటించారు.