Police Murder Case : రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ నాగమణి హత్యకేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఆమె సోదరుడైన పరమేశ్‌ను నిందితుడిగా గుర్తించి అతని నుంచి హత్యకు వినియోగించిన కత్తి, ఓ కారును, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కులాంతర వివాహం సహా ఎకరం భూమి విషయంలోనే నాగమణిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరమేశ్‌కు హైమావతి, నాగమణి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. హైమావతికి 2009లో వివాహం జరిగింది.
నాగమణికి 2014లో పటేల్ గూడకి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం సమయంలో నాగమణికి ఎకరం భూమిని కట్నంగా ఇచ్చారు. కానీ కుటుంబ కలహాలతో భర్త నుంచి దూరంగా వచ్చేసిన నాగమణి హయత్‌నగర్ హాస్టల్‌లో ఉండి చదువు పూర్తి చేసి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. మొదటి భర్త నుంచి ఆమెకు 2022లో విడాకులు లభించాయి. అయితే కొన్నేళ్లుగా రాయప్రోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించింది.
కులాంతర వివాహమే కారణమా? : విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమెకు వారి కులానికి సంబంధించిన వ్యక్తితోనే వివాహంచేసేందుకు ప్రయత్నించారు. కానీ తన వ్యక్తిగత జీవితానికి అడ్డువస్తున్నారని తనకు ఇచ్చిన ఎకరం భూమిని సైతం నాగమణి తిరిగి పరమేశ్‌కు ఇచ్చేసింది. 15రోజుల క్రితం శ్రీకాంత్‌ను వివాహం చేసుకుని వనస్థలిపురంలో నివాసముండేది. కొద్ది రోజులుగా తిరిగి తన భూమి తనకు ఇవ్వమని పరమేశ్‌పై ఒత్తిడి తేవడం, సోదరి కులాంతర వివాహం నచ్చని పరమేశ్ ఆమెపై కక్ష పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.