Accountant Lost Rs.10 cr in Cyber Crime in Hyderabad :స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి నగరంలోని ఓ అకౌంటెంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.10.10 కోట్లు కొట్టేశారు. మొదట రూ.19 వేల లాభం చూపించి, తర్వాత భారీ మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారు. అలా ఆ వ్యక్తి నుంచి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టించారు. అందుకు రూ.24.36 కోట్ల లాభం వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. కానీ ఆ డబ్బు మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి మరో రూ.3 కోట్లు బదిలీ చేయాలని కండీషన్ పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన అతను మోసపోయాయని గ్రహించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక సైబర్ మోసంలో ఇంతటి భారీ మొత్తంలో సొమ్ము కోల్పోవడం ఇది మూడో ఘటన అని పోలీసులు తెలిపారు.
కొత్త నంబర్ నుంచి మీ వాట్సప్‌కు వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చిందా? - అది చెక్ చేయకుండా ఓపెన్ చేశారో?
హైదరాబాద్‌లోని మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన అకౌంటెంట్ ఫోన్ నంబరును ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వెల్త్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అక్టోబరు 2న గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేశారు. ఈ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై చర్చిస్తూ, దానికి సంబంధించిన పోస్టులు పెట్టేవారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రతినిధినంటూ చేతన్ సెహగల్ అనే వ్యక్తి పెట్టుబడులపై సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. అతని సహాయకురాలినంటూ మీరాదత్ అనే మహిళ అకౌంటెంట్‌తో చర్చలు జరిపేది.