ACB Toll-free Number For Bribe Complaints :ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు స్వీకరించేవారిపై ఏసీబీ కఠినచర్యలు చేపడుతోంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘాపెట్టి ఆధారాలతో సహాఅరెస్ట్ చేస్తోంది. లంచం తీసుకున్న అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేసి అక్రమాల బాగోతాన్ని బయటపెడుతోంది. ప్రతి విషయాన్ని ఆడియో, వీడియోరికార్డింగ్ చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ఎంత? ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు కూటబెట్టారున్న అంశాలని పరిగణనలోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు పెట్టి కఠిన శిక్ష పడేలా ఏసీబీ ముందుకెళ్తోంది.
ACB Cases Are Increasing In Telangana :వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ జాయింట్ సబ్‌రిజిస్టార్ శ్రీనివాసులు రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కరీంనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజర్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ ఎస్.ఐ ఆనంద్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. లక్షరూపాయలు లంచం తీసుకుంటూ సైబరాబాద్ సూరారం పోలీస్‌స్టేషన్ సీఐ ఆకుల వెంకటేషం అనిశాకు చిక్కారు.
లంచం తీసుకుంటున్న అధికారులపై ఏసీబీ దాడులు :రాయికల్ ఠాణా ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ ఠానా ఎస్‌ఐ రవి రూ.50 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ ఆర్ఐ దుర్గయ్య రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇటీవల రాజేంద్రనగర్ జీహెచ్‌ఎంసీ ఏఈ బల్వంత్‌రెడ్డి రూ.15 వేలు లంచం తీసుకుంటూ చిక్కారు. నాంపల్లి నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేష్‌కుమార్ లక్ష తీసుకుంటుగా పట్టుకున్నారు.