ACB Raid on EX Additional Collector Bhupal Reddy : రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.వి.భూపాల్‌రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్లోని ఇందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, మిర్యాలగూడ, సాగర్ రింగ్‌రోడ్‌లోని ఆయన సమీప బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5.05 కోట్ల విలువైన నగదు, స్థిరాస్తుల దస్తావేజులు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ పత్రాల్లో మాజీ అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఇద్దరు అల్లుళ్ల పేరు మీద 32 ఇళ్ల స్థలాల దస్తావేజులున్నాయి. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో మొత్తం రూ.4.19 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలకు భూపాల్‌రెడ్డి సరైన ఆధారాలు చూపించకపోవడంతో కేసు నమోదు చేశారు. ఆయన ఆస్తుల విలువ ఇప్పటి మార్కెట్ లెక్కల ప్రకారం దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని అంచనా. భూపాల్‌రెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో స్థిర, చరాస్తులను కొనుగోలు చేసి తనకు వారు బహుమతిగా ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎల్బీనగర్ సమీపంలోని ఇందూ అరణ్యలోని రెండుల విల్లాల్లో ఒకదాన్ని బహుమతి ఇచ్చినట్టు చూపించారు. మరో విల్లాను సైతం ఇటీవలే విక్రయించారు.
బహుమతిగా చలా‘మనీ’ :ధరణి పోర్టల్‌లో లోపాలు భూ కేటాయింపులపై నిర్ణయాల్లో భారీగా ముడుపులు ఆశించారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు పరిశోధించగా ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ ప్రాంతాల్లో భూపాల్‌రెడ్డి తన ఇద్దరు అల్లుళ్ల పేరుతో చెరో 16 ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆ పత్రాలను ఆయన ఇంటిలోనే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఆయన ఇద్దరు అల్లుళ్లకు ఫోన్ చేసి ఆస్తుల కొనుగోలు గురించి ప్రశ్నించారు. దానికి వారు కొనుగోలు చేశామని సమాధానం ఇచ్చినా కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకుపోయారని తెలిసింది.