ACB Questioned APMDC EX MD Venkata Reddy :వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక టెండర్ల , తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకూ ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమేనని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమేనని కానీ అవన్నీ అత్యున్నత స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవేనని చెప్పినట్లు తెలిసింది. 'దయచేసి ఆ పేర్లు అడగొద్దు. నేను చెప్పలేను. ఆ ఆదేశాలూ నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి' అంటూ వెంకటరెడ్డి చెప్పుకొచ్చినట్లు సమాచారం.
సమాధానం చెప్పడానికి నిరాకరణ :ఇసుక కుంభకోణంలో మొత్తంగా రూ.2600 కోట్లను దోచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. దీని అంతిమ లబ్ధిదారులు ఎవరని పలు రకాలుగా గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించినట్లు తెలిసింది.
ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన వెంకటరెడ్డిని విచారించేందుకు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివిధ రకాల పత్రాలు, డాక్యుమెంట్లు చూపించి టెండర్లలో అవకతవకలు, గుత్తేదారు సంస్థల నుంచి నిబంధనల ప్రకారం సొమ్ములు వసూలు చేయకుండా సహకారం అందించడం వంటివి అంశాలపై ఆయణ్ని అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అక్రమాలు నిజమేనని వెంకటరెడ్డి అంగీకరించారని అప్పట్లో ఏం జరిగిందో వివరించారని సమాచారం.
Mines Venkata Reddy Irregularities :వేల కోట్ల దోపిడీకి ముందస్తు నేరపూరిత కుట్రలో భాగంగానే గనుల శాఖ డైరెక్టర్ పోస్టులో తెచ్చిపెట్టుకున్నారా? నియామకం ముందు మీకు ఎలాంటి ఆదేశాలిచ్చారు అని వెంకటరెడ్డిని ఏసీబీ ప్రశ్నించినట్లు తెలిసింది. అవేవి తనకు తెలియదని ఆయన సమాధానమిచ్చారని తెలుస్తోంది. వారి ఆదేశాలు పాటిస్తాననే ఉద్దేశంతో తనను అక్కడ నియమించి ఉండొచ్చని చెప్పినట్లు సమాచారం. వారి అక్రమాలకు మీరు సహకరించినట్లే కదా! అని ప్రశ్నించగా వెంకటరెడ్డి నీళ్లు నమిలినట్లు తెలిసింది.