People Are Suffering To Chandole Road In Bapatla District : కూటమి సర్కారు వచ్చాక రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు పరుగులు పెడుతున్నాయి. చిన్నపాటి గుంత కూడా కనిపించకుండా అద్దంలా మెరిసేలా చేస్తున్నారు. కానీ బాపట్ల జిల్లాలో ఆ రహదారిపై ఇంకా గుంతలు దర్శనమిస్తున్నాయి. అదేదో మారుమూల రహదారి అనుకుంటే పొరపాటే. చారిత్రక ప్రదేశమైన బగళాముఖి అమ్మవారు కొలువైన క్షేత్రానికి వెళ్లే దారి అది. భక్తులతో పాటు ప్రముఖులు సైతం రోడ్డు దుస్థితిపై పెదవి విరుస్తున్నారు.
హడలిపోతున్న జనం : జగన్ సర్కారు నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లు రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్థంగా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టింది. అందుకు తగ్గట్టే భారీగా నిధులు సైతం కేటాయించింది. బాపట్ల జిల్లాలో R&B యంత్రాంగం రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించి చురుగ్గా పనులు చేస్తోంది. కానీ వారి ప్రాధమ్యాలు సరిగా లేని కారణంగా ముఖ్యమైన రోడ్లు ఇప్పటికీ గుంతలమయంగానే కనిపిస్తున్నాయి. పిట్లవానిపాలెం మండలం చందోలుకు వెళ్లే రహదారిపై ప్రయాణమంటేనే జనం హడలిపోతున్నారు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. ఇక్కడ బగళాముఖి అమ్మవారు కొలువై ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. అంతటి కీలకమైన రహదారి మరమ్మతుల విషయంలో అధికారులు ఇంకా చొరవ చూపలేదు.
సార్లూ మా ఊరికి రోడ్డు వేయండి - మంత్రి, కలెక్టర్కు చిన్నారుల విజ్ఞప్తి
ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బగళాముఖి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు పొన్నూరు-చందోలు రోడ్డు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని రోడ్డును బాగు చేయించాలని కోరారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలోనే ఈ దారిని బాగు చేయడంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు కూడా సంక్రాంతి నాటికి ఏ రహదారి మీదా గోతులు కనపడకుండా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక పరమైన చిక్కులు ఉండడం వల్లే రహదారి మరమ్మతులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రహదారుల ప్యాచ్ వర్క్‌లు జరుగుతున్నాయని త్వరలోనే ఈ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దుతామని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పష్టం చేశారు. రహదారి మరమ్మతులు వేగంగా పూర్తిచేస్తే ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు కోరుతున్నారు.
ఆగమేఘాల మీద రోడ్డు నిర్మాణం - అడ్డుకున్న స్థానికులు
ఆ రోడ్డులో తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? - కాస్త ఆలోచించుకోవడమే బెటర్!