No Shortage Of Liquor Stocks in AP :ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ఎల్, 23,000 కేసుల బీరు ఏపీ రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని స్పష్టం చేశారు.
ఏపీలో ఉన్న లిక్కర్ డిపోలలో 20 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 5.6 లక్షల కేసుల బీర్ విక్రయానికి అందుబాటులో ఉందని నిషాంత్ కుమార్ తెలిపారు. విభిన్న అవుట్ లెట్ల పరంగా 6.93 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ సిద్దంగా ఉందని, పూర్వపు సగటు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నిల్వ 9 రోజులు సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం వరదల కారణంగా తగిన నిల్వ సామర్ధ్యం లేక ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని కొన్ని అవుట్ లెట్లతో మాత్రమే నిల్వలు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు.
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం :ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్‌శాఖ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపనుంది. రేపటిలోగా గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశముంది.