Abhishek Singhvi As Congress Candidate To Contest Rajyasabha : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.
రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలు :రాజ్యసభలోని 12 స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబరు 3న ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, కామఖ్య ప్రసాద్ తస(బీజేపీ), మీసా భారతి (ఆర్జేడీ), వివేక్ ఠాకుర్ (బీజేపీ), దీపేంద్రసింగ్ హుడా (కాంగ్రెస్), ఉదయన్ రాజే భోస్లే (బీజేపీ), కె.సి.వేణుగోపాల్ (కాంగ్రెస్), బిప్లబ్ కుమార్ దేబ్ (బీజేపీ) లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారి రాజీనామాలతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.