Tiger Attacked a Car in Nellore : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారు, పెద్దపులిని ఢీకొట్టింది. ఈ ఘటనతో కారు డ్రైవర్ భయాందోళనకు గురయ్యారు. పులిని తప్పించే క్రమంలో కారు బోల్తా పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లె సమీపంలో నెల్లూరు-ముంబయి హైవేపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో నెల్లూరు వెళ్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఊహించని ఘటన :కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండటంతో పులిని కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్దపులి కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులోని ఐదుగురూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదంతో కారు ముందుభాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లి కూంబింగ్ చేయనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచారంతో మర్రిపాడు మండలంలోని అటవీప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.