A statue of Telangana Talli was Unveiled at the Secretariat : రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గుండు పూసలు, ముక్క పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి, హుందాతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త గంగాధర్‌ను, శిల్పి రమణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
విగ్రహ ఏర్పాటు, రూపురేఖలపై ఉదయం అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన గురించి అసెంబ్లీలో వివరించారు. సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకొని తెలంగాణ తల్లి రూపకల్పన చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని తెలిపారు.
"రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నాం. ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. తమ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని సన్మానిస్తున్నాం. ఎక్కా యాదగిరికి 300 గజాల స్థలం, రూ.కోటి నగదు ఇస్తాం. ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదు. 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ సాధించుకున్నాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి