Train Robberies in Telangana : రైల్వేలోని ప్రజారవాణా విభాగంలో భద్రత లోపం కారణంగా దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. తాజాగా శిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు అధికశాతం రైళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Shirdi - Kakinada Express Robbery :అంతరాష్ట్ర ముఠాలు పక్కా పథకం ప్రకారం దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఒక్కో ముఠాలో 5 నుంచి 8 మంది సభ్యులు వరకు ఉంటారు. వారిలో తప్పనిసరిగా ఒకరిద్దరు మహిళలు ఉండేవిధంగా చూసుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఆరా తీస్తారు. వారు నిద్రలోకి జారగానే ముఠాలు బెర్తుల కింద ఉన్న బ్యాగులు, చేతి సంచులు, సెల్‌ఫోన్లు వంటి విలువైన వస్తువులు కాజేసి రైలు వేగం తగ్గగానే కిందకు దూకుతారు. కొన్నిసందర్భాల్లో చైన్ లాగి పారిపోతుంటారు. దొంగతనం చేశాక ముఠా సభ్యులంతా ఎక్కడ కలవాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారు. దీని ప్రకారం కొల్లగొట్టిన సొమ్ముతో అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి రైళ్లు. ఇంతటి కీలకమైన ప్రజారవాణాలో భద్రత లోపం కారణంగానే ఏఓబీ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున గంజాయి నగరానికి చేరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. సరుకు రవాణాకు అధికశాతం స్మగ్లరు రైళ్లనే సురక్షితంగా భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం, బంగారం, బాల కార్మికుల రవాణా జరుగుతోంది. ఈ అక్రమ కార్యక్రమాలను మించి దొంగతనాలు రైల్వే పోలీసులకు సవాల్‌గా మారాయి. కొన్ని సందర్భాల్లో ప్రయాణీకుల ఏమరపాటు దొంగలకు అనువుగా మారుతోంది. సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారు.